Wednesday, April 16, 2014

The lessons we have to learn from this story:

అవినాష్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్... చీకు చింతా లేని జీవితం... తను కోరిన విధంగా జీవితం చాల సంతోషంగా గడుపసాగాడు.. వారిది ప్రేమ వివాహం.. భార్య కూడా చాల అణకువ కలిగినది.... వారిది మంచి అన్యోన్య దాంపత్యం.. జీవన క్రమంలో ... అవినాష్ తండ్రి అయ్యాడు.. బాబు(విక్రం) కు 5 సంవత్సరాలు వస్తాయి... అవినాష్ కొత్తగా ఆడి కారును కొంటాడు... అది అతనికి కలల స్వప్నం... చాల రోజులకు అతని కోరిక నెరవేరింది.... ఆ కారు అంటే అవినాష్ కు చాలా చాలా ఇష్టం..... ప్రతి ఆదివారం తన కొత్త ఆడి కారు ను ఎంతో ఇష్టంగా శుభ్రం చేసుకోవడం అలవాటు... ఆ రోజు కూడా దానిని శుభ్రం చేసే సమయంలో .... అతని కుమారుడు విక్రం అక్కడికి వచ్చి ఒక రాయిని తీసుకుని కారు మీద ఏమో చెక్క సాగాడు... ఆ చప్పుడుకు అవినాష్ ఏమి జరుగుతుందో గమనించీ గమనించగానే... తట్టుకోలేనంత కోపం వస్తుంది... ఆ కోపం తనను తానూ మర్చిపోతాడు... ఒక రేంచి తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఆ చిన్నారి చేతుల మీద కొడతాడు... మనిషి ఎంత మంచి వాడయిన ఒక దాని మీద ఇష్టం...మన కోపం ఒక్కొక్కసారి మనని ఉన్మాదిగా మారుస్తుంది... ఆ స్థితిలో అవినాష్ ఉన్మాదిగా మారాడు.. ఎదుట ఉన్నది తన చిన్నారి ముద్దుల కొడుకని కూడా మర్చిపోయాడు.... కొన్ని క్షణాల తర్వాత అర్ధం అయింది తానూ ఏం చేసాడో.. ...కానీ అప్పటికే ఆలస్యమయింది... వెంటనే బాబును తీసుకుని ఆసుపత్రికి పరిగెడతాడు... ఆసుపత్రిలో అన్ని పరీక్షల తర్వాత తెలుస్తుంది.. ఎముకలన్నీ తిరిగి అతుక్కోలేనంత నుజ్జు నుజ్జు అయ్యాయని... బాబు చెయ్యి మామూలు స్థితికి తిరిగి రాదని.... కన్నీరు మున్నీరయిన క్షణంలో .. బాబు అడుగుతాడు.. నాన్నా.. నా చేతులు తిరిగి రావా.... పరవాలేదులే బాధ పడకు.. ఇంకెప్పుడూ అలా చేయను.. అని దీనంగా అంటాడు... అవినాశ్ కు కన్నీటిని ఆపడానికి కాలేదు... తన చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ కారును నాశనం చేయాలనీ, చేద్దామని.. కారు దగ్గరకు వెళతాడు.. అప్పటి వరకూ తన కొడుకు కారు మీద ఏమి చెక్కాడు అనేది కనీసం చూడను కూడా చూడలేదు... ఇంతకూ ఆ కారు మీద బాబు ఏం చెక్కాడో తెలుసా... ఐ లవ్ యు డాడ్ .... అవినాశ్ తన మూర్ఖత్వానికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది... కానీ ఏమి చేస్తే ఆ చిన్నారిని బాగు చేయగలడు... చేసిన తప్పు తిరిగి దిద్దుకోగాలడా.... ఎంత డబ్బు ఉంటే ప్రయోజనమేముంది... చితికేడంతావివేకం ఉండాలి... వస్తువులపై వ్యామోహం ఉండకూడదు...

The lessons we have to learn from this story:
మనలో చాలా మందికి వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది... కానీ అది మనుష్యుల కంటే ఎక్కువ కాకూడదు.. దేవుడు వస్తువులను వాడుకోవడానికి .. మనుష్యులను ప్రేమించడానికి సృష్టించాడు.. మనమే వస్తువులను ప్రేమిస్తూ.. మనుష్యులను వాడుకుంటూ లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం.

Wednesday, April 9, 2014

తల్లితండ్రులని గౌరవించండి.

ఒక యువకుడు రెండు ఎత్తైన కొండల మధ్య ఫీట్స్ చేస్తున్నాడు ..
ఒక కొండ మీద నుండి ఇంకొక కొండ పైకి ఒక ఇనుప తీగ కట్టి ప్రజలందరూ చూస్తుండగా ఒక కర్ర ఆధారంగా తీగపై ఒక వైపు నుండి మరొక వైపుకు నడిచాడు
అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ..
తర్వాత ఒక చక్రం ఉండే తోపుడు బండి తీస్కుని ఒక వైపు నుండి మరొక వైపుకి నడిచాడు ..
చూస్తున్న వారందరూ మరల కరతాళ ద్వనులు చేసారు,
తర్వతా ఆ యువకునితో కొంత మంది ఇలా అంటారు ..
ప్రాణం లేని బండి, కర్ర తో నడవడం కాదు ఒక మనిషిని ఆ బండి లో కూర్చో పెట్టుకుని తీగపై నడువు అప్పుడు నీవు గోప్పవాడివని నమ్ముతాం అంటారు ..
అప్పుడా యువకుడు "ఎవరైనా వచ్చి ఈ బండి లో కూర్చుంటే అలాగే చేస్తాను" ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ..
అప్పుడు ఎవరు ముందుకు రారు, కాసేపటి తర్వాత ఒక ముసలి అతను వచ్చి బండి లో కూర్చుంటాడు ..
అక్కడున్న వారు ఎం తాత బ్రతుకు మీద ఆశ చచ్చి పోయిందా ఈ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంటి దగ్గర చెప్పి వచ్చావ" అని ఎగతాళి చేస్తారు ..
ఆ యువకుడు బండిలో ముసలి వ్యక్తిని కూర్చో పెట్టుకుని ఇవతలి నుండి అవతలికి సునాయాసంగా నడుస్తాడు.
అక్కడున్న కొందరు వచ్చి " ఎం తాత ఏ నమ్మకం తోటి ఆ అబ్బాయి మాటలు విని ఇంత పనికి తెగించావు " అని అడుగుతారు..??
ఎందుకంటే వాడు నా కొడుకు " అని అతను సమాధానం చెప్తాడు ..
ఫ్రెండ్స్.. ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిన నమ్మకపోయినా మీ తల్లితండ్రులు మిమ్మల్ని నమ్ముతారు..
మీ ఔన్నత్యం కోసం ఎంత త్యాగానికైనా సిద్ద పడతారు....
అవమానాలని కూడా భరిస్తారు...
మీ తల్లి తండ్రులు మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. తల్లితండ్రులని గౌరవించండి.

Wednesday, March 26, 2014

పెళ్లి ముడి

ఝామ్మున పెళ్లయిపోయింది. వధూవరులిద్దరూ హనీమూన్ బయలుదేరుతున్నారు. పెళ్లి కూతురు తల్లి కుమార్తె చేతిలో ఓ బ్యాంక్ పాస్ బుక్ పెట్టి చెప్పింది.
‘సంసారం అన్నాక కష్ట సుఖాలు వుంటాయి. నీకు బాగా సంతోషం కలిగిన రోజున ఎంతో కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆనందం కలిగించిన కారణాన్ని కూడా అందులో గుర్తుగా రాసుకో. పుస్తకం పారేసుకోకు. చెప్పింది మరచిపోకు’
గిర్రున ఏడాది తిరిగింది. పండంటి బాబు పుట్టాడు. ఆ సంతోషానికి గుర్తుగా కొంత డబ్బు డిపాజిట్ చేసింది.
నెలలు గడిచాయి. ఆమెకు జీతం పెరిగింది. పెరుగుతున్నఖర్చులకు తోడుగా జీతం పెరగడం కంటే ఆనందం ఏముంటుంది. దానికి గుర్తుగా మరికొంత సొమ్ము బ్యాంకులో చేరింది. మరి కొన్నాళ్ళకి అతడికి ప్రమోషన్. రెట్టింపు జీతం. కారు కొన్నారు. మంచి జరిగినప్పుడల్లా బ్యాంక్ డిపాజిట్ పెరుగుతూనే వుంది.
రోజులన్నీ ఒక్క మాదిరిగా వుండవు కదా.
కాపురంలో చిర్రుబుర్రులు మొదలయ్యాయి. సంభాషణల్లో అనురాగాల పాలు తగ్గి వాదాలు చోటుచేసుకోవడం ప్రారంభమయింది.
ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా నోరు తెరిచినా అది చివరకు నోరు పారేసుకోవడం దాకా వెళ్ళేది.
తల్లిదగ్గర చెప్పుకుంది.
‘ఇతగాడిని భరించడం ఇక నా వల్లకాదు. నేను విడాకులు తీసుకుంటాను మమ్మీ. అతడు కూడా వొప్పుకున్నాడు. ఇష్టం లేని కాపురం కన్నా విడిపోయి విడిగా వుండడమే హాయి’
విన్న తల్లి గుండె గతుక్కుమంది. అయినా తమాయించుకుని చెప్పింది.
‘నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా చెప్పు. అలాగే విడాకులు తీసుకుందురు కాని. కానీ నీ పెళ్ళిలో నీకొక బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చాను కదా. అందులో యెంత వేసారో ఏమిటో. ముందు ఆ డబ్బు బయటకు తీసి ఒక్క పైసా మిగలకుండా అంతా ఖర్చుచేసేయ్యి. ఎందుకంటే ఈ దాంపత్యం తాలూకు ఏవీ నీకు గుర్తులుగా మిగిలి వుండకూడదు.’
అమ్మాయి పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. క్యూలో నిలబడివున్నప్పుడు అనుకోకుండా పుస్తకం తెరిచి చూసింది. అందులో డిపాజిట్ చేసింది తక్కువసార్లే అయినా ఆ ఎంట్రీల వద్ద రాసిపెట్టిన జ్ఞాపకాలు ఆమెను కదిలించాయి. పిల్లవాడు పుట్టడం, జీతాలు పెరగడం, ప్రమోషన్ రావడం – ఆ సందర్భాల్లో తమ నడుమ చోటుచేసుకున్న ఆహ్లాదకర క్షణాలు – ఓహ్ – జీవితమంటే యెంత ఆనందం.
ఇక అక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది. 'ఇదిగో. ఈ పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళు. ఎంతవుంటే అంత తీసేసుకుని అంతా ఖర్చు చేసెయ్యి. ఆ తరవాతే ఇంటికి రా’
మర్నాడు వచ్చాడు. వచ్చి భార్య చేతిలో పాస్ బుక్ పెట్టాడు. అందులో కొత్త డిపాజిట్ వుంది. దానికి కింద ఇలా రాసాడు.
‘ఈ రోజు నా జీవితంలో గొప్పరోజు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిందీ, ఇన్నేళ్ళ దాపత్యంలో నువ్వు నాకెంత సంతోషాన్ని అందించిందీ అన్నీ ఈ రోజే మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.’
ఎవరు ముందో తెలియనంత వేగంగా వారిద్దరూ ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నారు. ఆనంద భాష్పాలతో వారి కాపురం పునీతమైంది.
తరువాత వారు చేసిన మొట్టమొదటి పని – బ్యాంకు పాస్ బుక్ ను భద్రంగా బీరువాలో దాచిపెట్టడం.

Monday, March 24, 2014

అమ్మ ప్రేమ అద్భుతం వేల కట్ట లేనిది

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.
ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?

Tuesday, March 18, 2014

ధర్మసూక్ష్మాలు

మంచి నీతి కథ...

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు. ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు. కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపము లో భాగము మనకు పంచుతారు. తస్మాత్ జాగ్రత్త!

Thursday, March 13, 2014

మూడు ఖర్చులు:

మంచి కరువు కాలాన ఒక పెద్దమనిషి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణం పెట్టుకున్నాడు. కరువు రోజుల్లో చుట్టుపక్కలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా. ఎండిపోయిన పైర్లు, పగుళ్లిచ్చిన నేలలు, నీళ్లింకిపోయిన చెరువులు. అల్లాడుతున్న జనం. ఆహా కలికాలం వచ్చేసిందిగదా అని అదంతా చూసుకుంటూ వస్తున్నాడంట పెద్దమనిషి.
కొంత దూరం వచ్చాక ఆయనకు ఒక పొలం కనిపించింది. అది ఏపుగా ఉంది. పచ్చగా ఉంది. కళకళలాడుతూ ఉంది. దానిని చూసి ఆశ్చర్యపోయాడు పెద్దమనిషి. ఇంతలో బడబడమని ఒక నల్లటి మబ్బు కదిలివచ్చి ఆ పొలం ఎంతవరకు ఉందో అంత వరకే వచ్చి నిలబడింది. ఆ తర్వాత ఆ పైరుకు ఎంత వానకావాలో అంత వానా కురిపించి వెళ్లిపోయింది.
పెద్దమనిషికి మతిపోయింది.
యిదంతా పట్టించుకోకుండా పొలంలో దిగి పనులు చేసుకుంటున్న ఆ పొలం రైతు దగ్గరకు వెళ్లి “ఏమయ్యా! నేను యింత దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా పచ్చి గరిక మొలవలెదు. నీ పైరేమో విరగపండుతోంది. నీ పైనే వాన కురుస్తూ ఉంది. ఏమి ఈ మాయ?” అని అడిగాడు.
“ఏమో స్వామి. నాకేమి తెలుసు. నేను వ్యవసాయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరికి వానలు కురిసినా కురవకపోయినా నా చేనుకి వాన కురుస్తూనే ఉంది. ఎవరికి పండినా పండకపోయినా నా చేను పండుతూనే ఉంది” అన్నాడు రైతు.
“కాదు. యిందులో ఏదో పరమార్థం ఉంటుంది. నీ జమా ఖర్చుల సంగతి చెప్పు” అన్నాడు పెద్దమనిషి.
“ఏమిలేదు స్వామి. పంట పండించాక వచ్చిన సొమ్ముని నేను మూడు ఖర్చులుగా విడగొడతాను. ఒక ఖర్చు నా ఇంటికీ సంసారానికీ ఉంచుకుంటాను. ఒక ఖర్చుని పంటకీ విత్తనాలకీ పాడికీ పశువుకీ ఉంచుకుంటాను. మూడో ఖర్చుని పేదలికీ సాదలకీ పంచి పెడతాను” అన్నాడు రైతు.
“అదీ అలా చెప్పు. ఇంక నీకు కురవకపోతే ఇంకెవరికి కురుస్తుందయ్యా వాన” అని వెళ్లిపోయాడు ఆ పెద్దమనిషి.

దయామయుడు

భక్తి, నమ్మకం
కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ కృష్ణ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి నిత్యం వేలమంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఒక భక్తుడు కాలునెప్పితో బాధపడుతూ ఉండేవాడు. 41 రోజుల పాటు నిత్యం గుడిదగ్గర స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 41 రోజులు పూర్తి అయ్యేసరికి కాలునెప్పి తగ్గించమని కృష్ణుణ్ణి వేడుకోసాగేడు. అతను డబ్బున్నవాడు కావడంతో , రోజు అతన్ని గుడికి తీసుకురావడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు. అలా శ్రద్ధగా 40 రోజులు పుర్తిచేసాడు. అయినా కాలునెప్పి తగ్గకపొవడంతో నిరాశపడసాగేడు.
గురువాయూర్ లోనే ఉన్న వేరొక భక్తుడు తన కుమార్తె పెళ్ళి కోసం కృష్ణ్ణుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరిగింది. అతను బాగా పేదవాడు కావడంతో పెళ్ళికి కావలసిన డబ్బు, నగలు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు రాత్రి కృష్ణుడు ఈ భక్తుని కలలోకి వచ్చి, రేపు పొద్దున్న గుడిదగ్గర చెరువుగట్టు మీద ఒకసంచి ఉంటుంది. అది తీసుకుని వెనక్కి తిరిగిచూడకుడా ఇంటికి వెళ్ళీపో అని చెప్పేడు.
కాలునెప్పి తగ్గించమని ప్రార్థిస్తున్న భక్తుడు , 41వ రోజు కృష్ణుడుకి కానుకగా ఇవ్వాలని ఒక సంచిలో బంగారునాణేలు పట్టుకుని గుడికివచ్చేడు. ఆ సంచి చెరువు గట్టుమీద పెట్టి స్నానానికి వెళ్ళేడు. ఇంతలో కృష్ణుడు చెప్పినట్లుగా పేదభక్తుడు చెరువు దగ్గరికి వచ్చి సంచి తీసు కుని వెనక్కి తిరిగిచూడకుండా పరిగెత్తసాగేడు. స్నానం చేస్తున్న భక్తుడు అది గమనించి తన సంచి ఎవరో దొంగ ఎత్తుకుపోతున్నాడని భావించి అతని వెనకాల పరిగెత్తేడు , కాని పట్టుకోలేకపోయేడు. తన దురదృష్టానికి బాధపడుతూ వెనక్కి వస్తూండగా ఒక్కసారిగా నడవగలుగుతున్న విషయం గమనించాడు. కాలునెప్పి తగ్గిపొవడమే కాకుండా ఇంతసేపు సంచి కోసం పరిగెత్తగలిగేనని తెలుసుకుని చాలా సంతోషించేడు.
ఈ విధంగా శ్రీ కృష్ణభగవానుడు ఇద్దరు భక్తుల కోరికలు సమయానుకులంగా తీర్చి సంతోషాన్ని అందించాడు.
నీతి: భగవంతుడు దయామయుడు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి తప్పకుండా స్పందిస్తాడు. ఆయనకి భక్తులందరు సమానమే, అయితే వాళ్ళ పరిస్థితిని బట్టి,సమయానుకూలంగా వాళ్ళని సంతోషపెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహించే పద్ధతులు వేరుగా ఉన్నా, అందరిపట్లా ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది.