పురుషాధిక్య భావజాలం వీడాలి. మనిషిని మనిషిగా చూడగలగాలి. మాటల్లోనే కాదు. చేతల్లోనూ తనలో సగభాగంగా సహధర్మచారిణిని అర్ధం చేసుకోవాలి. అంగీకరించాలి. ఇలాంటి ఇంటి వాతావరణం పిల్లల హృదయాలను స్పృశిస్తుంది,వికసింపజేస్తుంది
'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగ పలికే, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము...' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటనే జీవితాన మననం చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే వుండొచ్చు. 'భార్య అతనికి తోడునీడ..! 'భర్త' ఆమెకు బతుకంతా నమ్మకం. అసలు తొలిరోజుల్లోనే 'ఈమె నాకు సరియైన జోడీ' అన్న భావం పురుషుడికి కలగాలి. 'ఇతడు నాకు కొండంత అండ..' అన్న భరోసా ఆమెకు చేకూరాలి. 'నీవు లేని నేను లేనులే..అదీ నిజములే...! పూవు లేని తావి నిలువ లేదులేే..ఇదీ నిజములే..!' అని సినీ కవి అన్నట్టు..' రెండు వేణువులు: ఒకటే స్వరం. రెండు పుష్పాలు: ఒకటే పరిమళం. రెండు దీపాలు: ఒకటే వెలుగు. రెండు పెదాలు: ఒకటే వాక్కు. రెండు నేత్రాలు: ఒకటే దృశ్యం. వారిద్దరూ ఒకటే విశ్వం..' అని మహారాష్ట్ర భక్తకవి జ్ఞానేశ్వర్ అంటారు. అంటే ఆలుమగలు- ఆడ, మగగా మిగిలిపోకుండా భార్యాభర్తలుగా ఓ గూట్లోకి చేరి ఒకరికొకరిగా ఒక్కటైనప్పుడే సమైక్య జీవన సరాగ మాలిక. అప్పుడే సమభావం, సహధర్మం అనే పసందైన మేళవింపు ప్రతిఫలిస్తుంది. అది రెండు మంచి మనసుల మధ్య స్థిరంగా నిలిచే ఒకానొక గొప్ప నిర్వచనం కూడా అవుతుంది.
'రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా!
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా!
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే' అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ గీత రచనలో చెప్పినట్లు పెళ్లయిన తొలినాళల్లో పురుషుడు ఇలా కోరుకున్నా, స్త్రీ కోరుకొనేది వేరే వుంది. అతడి సమక్షంలో తానుండగా, తండ్రి గుర్తొచ్చినా బెంగ కలగకూడదు. మదిలో తల్లి మెదిలినా కన్నీళ్లు పెట్టకూడదు. అసలు పుట్టింటివారెవరూ తనవద్ద లేరనే దిగులే వుండకూడదు. ఆ విధంగా అతడే ఆమెకు అన్నీ తానై మెలగాలి. అలా అయిననాడు ఆమె నవ్వితే అతడు నవ్వాలి. ఆమెకు ముల్లు గుచ్చుకుంటే అతను విలవిలలాడాలి. ఆమెకు గాయమైతే అతడు నవనీతం పూయాలి. ఆమె నల్లని జడలో అతను మల్లియలా మెరవాలి. అటువంటి ప్రేమమూర్తి సన్నిధిలో ఆమె మనసు రాగరంజితం కావాలి. అలాంటి మధుర క్షణాల్లో ఆమె 'అతడొస్తూ వసంతాన్ని వెంట తెస్తాడు..' అంటూ మురిసిపోతుంది. అదీ సుమధుర దాంపత్యబంధం అంటే! అరమరికల్లేని అలాంటి అన్యోన్య దాంపత్యం మధురగీతంలా సుతిమెత్తగా సాగిపోతుంది.
No comments:
Post a Comment