Thursday, March 13, 2014

దయామయుడు

భక్తి, నమ్మకం
కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ కృష్ణ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి నిత్యం వేలమంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఒక భక్తుడు కాలునెప్పితో బాధపడుతూ ఉండేవాడు. 41 రోజుల పాటు నిత్యం గుడిదగ్గర స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 41 రోజులు పూర్తి అయ్యేసరికి కాలునెప్పి తగ్గించమని కృష్ణుణ్ణి వేడుకోసాగేడు. అతను డబ్బున్నవాడు కావడంతో , రోజు అతన్ని గుడికి తీసుకురావడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు. అలా శ్రద్ధగా 40 రోజులు పుర్తిచేసాడు. అయినా కాలునెప్పి తగ్గకపొవడంతో నిరాశపడసాగేడు.
గురువాయూర్ లోనే ఉన్న వేరొక భక్తుడు తన కుమార్తె పెళ్ళి కోసం కృష్ణ్ణుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరిగింది. అతను బాగా పేదవాడు కావడంతో పెళ్ళికి కావలసిన డబ్బు, నగలు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు రాత్రి కృష్ణుడు ఈ భక్తుని కలలోకి వచ్చి, రేపు పొద్దున్న గుడిదగ్గర చెరువుగట్టు మీద ఒకసంచి ఉంటుంది. అది తీసుకుని వెనక్కి తిరిగిచూడకుడా ఇంటికి వెళ్ళీపో అని చెప్పేడు.
కాలునెప్పి తగ్గించమని ప్రార్థిస్తున్న భక్తుడు , 41వ రోజు కృష్ణుడుకి కానుకగా ఇవ్వాలని ఒక సంచిలో బంగారునాణేలు పట్టుకుని గుడికివచ్చేడు. ఆ సంచి చెరువు గట్టుమీద పెట్టి స్నానానికి వెళ్ళేడు. ఇంతలో కృష్ణుడు చెప్పినట్లుగా పేదభక్తుడు చెరువు దగ్గరికి వచ్చి సంచి తీసు కుని వెనక్కి తిరిగిచూడకుండా పరిగెత్తసాగేడు. స్నానం చేస్తున్న భక్తుడు అది గమనించి తన సంచి ఎవరో దొంగ ఎత్తుకుపోతున్నాడని భావించి అతని వెనకాల పరిగెత్తేడు , కాని పట్టుకోలేకపోయేడు. తన దురదృష్టానికి బాధపడుతూ వెనక్కి వస్తూండగా ఒక్కసారిగా నడవగలుగుతున్న విషయం గమనించాడు. కాలునెప్పి తగ్గిపొవడమే కాకుండా ఇంతసేపు సంచి కోసం పరిగెత్తగలిగేనని తెలుసుకుని చాలా సంతోషించేడు.
ఈ విధంగా శ్రీ కృష్ణభగవానుడు ఇద్దరు భక్తుల కోరికలు సమయానుకులంగా తీర్చి సంతోషాన్ని అందించాడు.
నీతి: భగవంతుడు దయామయుడు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి తప్పకుండా స్పందిస్తాడు. ఆయనకి భక్తులందరు సమానమే, అయితే వాళ్ళ పరిస్థితిని బట్టి,సమయానుకూలంగా వాళ్ళని సంతోషపెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహించే పద్ధతులు వేరుగా ఉన్నా, అందరిపట్లా ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది.

No comments:

Post a Comment