Thursday, March 13, 2014

మూడు ఖర్చులు:

మంచి కరువు కాలాన ఒక పెద్దమనిషి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణం పెట్టుకున్నాడు. కరువు రోజుల్లో చుట్టుపక్కలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా. ఎండిపోయిన పైర్లు, పగుళ్లిచ్చిన నేలలు, నీళ్లింకిపోయిన చెరువులు. అల్లాడుతున్న జనం. ఆహా కలికాలం వచ్చేసిందిగదా అని అదంతా చూసుకుంటూ వస్తున్నాడంట పెద్దమనిషి.
కొంత దూరం వచ్చాక ఆయనకు ఒక పొలం కనిపించింది. అది ఏపుగా ఉంది. పచ్చగా ఉంది. కళకళలాడుతూ ఉంది. దానిని చూసి ఆశ్చర్యపోయాడు పెద్దమనిషి. ఇంతలో బడబడమని ఒక నల్లటి మబ్బు కదిలివచ్చి ఆ పొలం ఎంతవరకు ఉందో అంత వరకే వచ్చి నిలబడింది. ఆ తర్వాత ఆ పైరుకు ఎంత వానకావాలో అంత వానా కురిపించి వెళ్లిపోయింది.
పెద్దమనిషికి మతిపోయింది.
యిదంతా పట్టించుకోకుండా పొలంలో దిగి పనులు చేసుకుంటున్న ఆ పొలం రైతు దగ్గరకు వెళ్లి “ఏమయ్యా! నేను యింత దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా పచ్చి గరిక మొలవలెదు. నీ పైరేమో విరగపండుతోంది. నీ పైనే వాన కురుస్తూ ఉంది. ఏమి ఈ మాయ?” అని అడిగాడు.
“ఏమో స్వామి. నాకేమి తెలుసు. నేను వ్యవసాయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరికి వానలు కురిసినా కురవకపోయినా నా చేనుకి వాన కురుస్తూనే ఉంది. ఎవరికి పండినా పండకపోయినా నా చేను పండుతూనే ఉంది” అన్నాడు రైతు.
“కాదు. యిందులో ఏదో పరమార్థం ఉంటుంది. నీ జమా ఖర్చుల సంగతి చెప్పు” అన్నాడు పెద్దమనిషి.
“ఏమిలేదు స్వామి. పంట పండించాక వచ్చిన సొమ్ముని నేను మూడు ఖర్చులుగా విడగొడతాను. ఒక ఖర్చు నా ఇంటికీ సంసారానికీ ఉంచుకుంటాను. ఒక ఖర్చుని పంటకీ విత్తనాలకీ పాడికీ పశువుకీ ఉంచుకుంటాను. మూడో ఖర్చుని పేదలికీ సాదలకీ పంచి పెడతాను” అన్నాడు రైతు.
“అదీ అలా చెప్పు. ఇంక నీకు కురవకపోతే ఇంకెవరికి కురుస్తుందయ్యా వాన” అని వెళ్లిపోయాడు ఆ పెద్దమనిషి.

No comments:

Post a Comment